Download!Download Point responsive WP Theme for FREE!

ఉపాసనీ మహారాజ్ జీవిత విశేషాలు || upasni maharaj life history

ఉపాసనీ మహారాజ్ జీవిత విశేషాలు || upasni maharaj life history

ఉపాసనీ బాబా యొక్క జన్మనామం “కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని, (మే 15, 1870 – డిసెంబరు 24, 1941) సద్గురు ఉపాసకులు. ఆయన భారతదేశం లోణి సకోరి లో నివసించారు. ఆయన షిర్డీ సాయిబాబా నుండి జీవన్ముక్తి పొందారని ప్రతీది. ఆయన షిర్డీ కి ఐదు కిలోమీటర్ల దూరంలో గల మహారాష్ట్ర రాష్ట్ర జిల్లా యిన అహ్మద్ నగర్ కు చెందినవారు.

జీవిత విశేషాలు
ఆయన పాండిత్యానికి, భక్తికీ ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 15, 1870 న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక గూడ అతనిలో మార్పేలేదు.

సరికదా ఒకనాడు ఇల్లు విడచి కాలినడకన నాసిక్ చేరాడు. రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి, తిరిగివచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లీ మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి, ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు. తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళ్తు౦డగా ఒక అడవిలో ఒక కొండమీద గుహ కన్పించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలచి ఒక పెద్దచెటు పైకెక్కి అందులో దూకాడు. అక్కడ నిరంతరం జపంచేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినపుడు ఒక దివ్యదర్శనమైంది. ప్రక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూలేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. ప్రక్కనే వాననీరు చిన్న మడుగుకట్టివుంటే త్రాగి, వాటితో శరీరం తుడుచుకున్నాడు. నాల్గవరోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరకెడుతున్నాడు. తనకొకవైపు ఒక ముస్లిం సాధువు, మరోవైపాక సన్యాసి వున్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి, లోపల బంగారం వంటి దేహమతనికి చూపి, “ఎందుకు చావయత్నిస్తావ్? మేము నిన్నెన్నటికీ చావనివ్వము!” అన్నారు. అప్పుడతడు గుహనుండి దిగి, జూలై 22, 1890న ఇల్లు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో వున్నట్లు తెలుసుకొన్నాడు.

ఒక సం. లోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యమభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. గాని వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలోనుండగా భార్య భయపడి నీరుచల్లి మేల్కొలిపింది. అప్పటినుండి అతనికి గాలి పీల్చడమెంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది ఏ వైద్యానికీ ఆ బాధతగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూరులే తొలగించగలరని తలచి, భార్యను ఇంటవదలి, 1911లో అట్టివారిని వెదుకుతూ బయలుదేరాడు కాశీనాథ్. అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, “నీవు మంచి స్థితిలో వున్నావు. నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు” అన్నారు. కాని, సాయి “ముస్లిమ్” అని తలచి, వారిని దర్శించలేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృద్దుడు కన్పించి, “చన్నీరు త్రాగవద్దు, వేడినీరు మాత్రమే త్రాగు!” అని చెప్పాడు. అతడా మాట లెక్కపెట్టక, వేరొకచోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తూంటే ఆ వృదుడే మళ్ళీ ఎదురై మందలించి, ప్రక్క గ్రామంలో వేడినీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు! కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలావరకు తగ్గింది. తర్వాత అతడు ఖేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహరాజ్ ను దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, “నీవు లోపల, బయట బంగారం పూసినట్టు, మంచి యోగస్థితిలో వున్నావు. నీవు కోరదగినదేమీ లేదు” అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే యిచ్చాడు. గత్యంతరంలేక జూన్ 27, 1911 న శిరిడీ చేరాడు కాశినాథ్.

రెండు రోజులు సాయి సన్నిధిలో వుండడంతోనే అతని బాధ మటుమాయమైంది! అయినా అతనికి ‘ఫకీరు’ సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. “నీవు వెళ్ళిద్దు, వెడితే 8వ రోజుకు రావాలి!” అన్నారు బాబా, ఆ మాట అతనికి నచ్చలేదు. అపుడు సాయి, “సరే, వెళ్ళు. నేను చేసేది చేస్తాను” అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడచినా, 8వ రోజుకు 20 మైళ్ళలోనున్న కోపర్గాము చేరాడు! అక్కడ ప్రథమంగా శిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్ళారు. సాయి అతణ్ణి చూస్తూనే నవ్వి, “నీవు వెళ్ళి ఎన్ని రోజులయింది?” అన్నారు. ఎనిమిది రోజులయిందన్నాడు కాశీనాథ్. అప్పుడతనిని వాడాలో వుండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గాడు.

శిరిడీలో నిత్యమూ భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతనివైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు. “ఒకప్పుడు ఒక ఆమె గర్భిణియై కొన్ని సంవత్సరాలయినా ప్రసవించలేదు. ఆమెను వేడినీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్కచేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. ప్రక్క గ్రామంలో వేడినీరు త్రాగాక ఆమెకు బాధ చాలావరకూ తగ్గింది” అన్నారు. తనకు రెండుసార్లూ దర్శనమిచ్చిన వృద్ధుడు ఆయనేనని గుర్తించి పులకించాడు కాశీనాథ్, తర్వాత బాబా, “కొన్నివేల సం. లుగా మనిద్దరికీ ఋణానుబంధ మున్నది” అని, “ఒక బావి ప్రక్క చెట్టుమీద రెండు పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది” అన్నారు. మాయలోబడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం గాబోలు! తర్వాత కాశీనాథ్‌తో, “ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సం. లుండు; ఖండోబా కృప లభిస్తుంది” అన్నారు బాబా. రోజూ శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని, మొదట మశీదులో సాయికి నివేదించి, తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు “నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా?” అన్నారు బాబా. అతడికేమీ అర్థంగాలేదు. ఒకరోజొక నల్లకుక్క అన్నంకోసం అతని వెంటపడింది. దానిని తరిమేసి నివేదనతో మశీదు చేరగానే సాయి, “ఇంతదూరం రానక్కరలేదు. నేనక్కడే వున్నాను. ఆ నల్లకుక్కను నేనే!” అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, “అక్కడ హరిజనుడి రూపంలోనున్న నన్ను తిట్టావు. నీవెక్కడ చూస్తే, అక్కడే వున్నాను గుర్తుంచుకో!” అన్నారు.

అతడు సాయి చెప్పినది మరచి వేదాంతగొష్టి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సం||లకు పైగా గడచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానమూ గలవాడేమో, ఈ బాధలు మరీ తీవ్రంగా వుండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్న ద్వేషమనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నోరీతుల బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు శిరిడీ వదలి వెళ్ళాలనుకున్నాడు. కాని సాయి వెళ్ళనివ్వలేదు. “నీవిప్పుడెంత ఓర్చుకొంటే నీ భవిష్యత్తు అంత ఉజ్జ్వలంగా వుంటుంది. నాలుగు సం.లు యిక్కడుంటే నా స్థితే నీకూ కలుతుంది” అనేవారు. కాని అతడు సుమారు 3 1/2 సం||లున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కాని అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు, నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కాని ఆయన ముస్లిమని శంకించాడు. వెంటనే సాయి అతనికేసి ఉరిమిచూచారు. అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తనకాళ్ళు వెనక్కు తీసుకుని, “నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిమ్! నువ్వాయనకు నమస్కరించకూడదు! అటువంటప్పుడు నీతో నాకేమి పని?” అన్నారు. చివరకు ఆయన శిరిడీ దగ్గరున్న సాకోరిలో ఉపాసనీ బాబాగా స్థిరపడి, డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు . శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4 సం||లు పూర్తిగా శిరిడీలోనే వుంటే ఏమయ్యేదో!

share it with friends

Add a Comment

Your email address will not be published. Required fields are marked *